సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల.ఇల్లు కట్టేటప్పుడు ప్రతి విషయంలో వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి. ఇంటి నిర్మించేటప్పుడు దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలి.. అలా కట్టుకోకపోతే ఏమవుతుంది. ఇంటిలో బరువైన వస్తువులు ఎక్కడ ఉండాలి.. మొదలగు విషయాల గురించి . .. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .!
ప్రశ్న:మేము ఇల్లు కట్టడం మొదలు పెట్టాలనుకుంటున్నాం. అయితే దేవుడికి ప్రత్యేకంగా గది లేకపోతే అప్పులపాలవుతారని చాలామంది అంటున్నారు. అందుకే పూజ గది కూడా ప్రత్యేకంగా కట్టాలనుకుంటున్నాం. కచ్చితంగా ఈశాన్యంలోనే కట్టాలని కూడా కొంతమంది సూచిస్తున్నారు. అసలు దేవుడి గది ఎలా, ఎక్కడ ఉంటే మంచిది? అలాగే చనిపోయిన మా పెద్దల ఫొటోలను ఆ గదిలో పెట్టుకోవచ్చా?
జవాబు: పూజ గది ఎక్కడున్నా దానికి తలుపు ఉండటం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. అది కుదరనప్పుడు కనీసం పరదా అయినా అడ్డుగా ఉండాలి. మీ కొత్త ఇంట్లో పూజ గదిని ఈశాన్యంలో కొందరు పెట్టమంటున్నారని చెప్తున్నారు. కానీ దాన్ని నేను సమర్థించను. ఎందుకంటే ఆ మూల బరువు ఉండకూడదు. అక్కడ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నట్లు లెక్క. ప్రత్యేకంగా అక్కడ దేవుడి పటాలను పెట్టనక్కర్లేదు. అసలు ఈశాన్యం మూల దీపారాధనలు చేయకూడదు. అలాగే, పూజ గదిని నైరుతి మూలన కాకుండా, పడమర గోడకు పెట్టి, దేవుడి ముఖం తూర్పునకు ఉండేలా చూసుకోవాలి. లేదా హాల్లో పెట్టుకునేట్లయితే దేవుడి ముఖం పడమర చూడొచ్చు. చనిపోయిన పెద్దల ఫొటోలను దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వాళ్లకు పూజ కూడా చేసుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్చెబుతున్నారు
►ALSO READ | జ్యోతిష్యం: గ్రహాల రాజు సూర్యుడు నక్షత్రం మార్పు.. ఇక ఆ నాలుగు రాశులు వారు పట్టింది బంగారమే..!
ప్రశ్న: బరువులు నైరుతి మూలనే ఉండాలంటారని పడకగదిలో ఆ మూలన బీరువా పెట్టాం. అయితే వాషింగ్ మెషిన్ లాంటి బరువైన వస్తువులను ఎక్కడ పెట్టాలి? ప్రస్తుతం దాన్ని హాల్లో ఈశాన్యంలో ఉన్న బియ్యం బస్తాల పక్కనే పెడుతున్నా, ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ 'హాల్లో ఎందుకుపెట్టారు. మంచిది కాదు' అంటున్నారు. బరువులను నైరుతిలో కాకుండా ఇంకెక్కడెక్కడ పెట్టొచ్చు?
జవాబు: బరువైన బీరువా, బియ్యం బస్తాలు వంటివి నైరుతి మూల పెట్టడమే మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం అక్కడ బరువులు ఉండాలి. అయితే వాషింగ్ మెషిన్ కూడా బరువైన వస్తువే. కాబట్టి దాన్ని కూడా నైరుతిలో పెట్టాలి. హాల్లో నైరుతి మూలన పెట్టుకోవచ్చు. హాల్లో ఖాళీ లేదు అనుకుంటే మధ్య దక్షిణ, మధ్య పడమరలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
